ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో సుమారు 3,500 దరఖాస్తులు స్వీకరణ
భూ రీ-సర్వేతో ఏడాదిన్నరలో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
కల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
కల్లూరు, జూలై -30:
ప్రజల సమస్యలను ప్రభుత్వం నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
కల్లూరు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్‌లో గురువారం కల్లూరు, తల్లాడ మండలాలకు సంబంధించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మొత్తం సుమారు 3,500 దరఖాస్తులు అందాయని తెలిపారు.వాటిలో 1,800 ఇందిరమ్మ ఇళ్లకు, 500 వరకు రెవెన్యూ సమస్యలకు, 200 పెన్షన్లకు, ఇతర మిగతా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు. ఇదే విధంగా పాలేరు నియోజకవర్గ ప్రజా దర్బార్‌లో 25 వేల దరఖాస్తులు అందగా, వాటిలో 13 వేల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవేనని తెలిపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గం సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఒకేసారి అందరికీ ఇళ్లు మంజూరు చేస్తే ఆర్థిక భారం పెరుగుతుందని, అందుకే దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపడుతున్నా మని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8.5 లక్షల కోట్ల అప్పు భారం మోపినప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి రాజీ ఉండదన్నారు.
సత్తుపల్లి, కల్లూరు ప్రాంతాల్లో గత 50 సంవత్సరాలుగా ఉన్న రెవెన్యూ సమస్యలను భూ రీ-సర్వే ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సర్వే కొనసాగుతోందన్నారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే పూర్తి చేసి శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పారు.
ధరణి వ్యవస్థలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. పేదల భూములు ఎలా కాజేయబడ్డాయో, భూముల మళ్లింపులు, ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు అన్నీ ప్రజలకు వెల్లడవుతాయని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. గత యాసంగి లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని, ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయనివిమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్‌వోలకు ఆగస్టు 3లోపు తప్పనిసరిగా అందజేసి ఓటు హక్కును పరిరక్షించు కోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ ప్రజాదర్బార్‌లో వచ్చిన 25 వేల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని, సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో 3,500 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వీటిలో గృహ నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయని చెప్పారు.
మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భూ సర్వే నిర్వహిస్తున్నా మని, ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేసి త్వరలో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రతి దరఖాస్తును సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తుల్లో ఫోన్ నంబర్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, పూర్తి సమాచారం ఉంటేనే సంబంధిత అధికారుల ద్వారా వేగంగా పరిష్కారం అందించ గలమని కలెక్టర్ సూచించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు ప్రజల వద్దకే రావడం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రత్యేకత అని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో భూ సర్వే వేగంగా సాగుతోందని, రెండు నెలల్లో పెండింగ్ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ధరణి వల్ల భూములు కోల్పోయిన రైతులకు భూ భారతి ద్వారా న్యాయం జరుగుతోందని పేర్కొంటూ, సత్తుపల్లి నియోజకవర్గానికి అదనంగా 1,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
ప్రభుత్వం ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల లోపు రుణ మాఫీ, విద్యార్థులకు యూనిఫాంలు, ఉచిత అల్పాహారం, వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
రూ.15 కోట్లతో మున్సిపల్ అభివృద్ధి పనులు, సత్తుపల్లిలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, కల్లూరు మున్సిపాలిటీకి అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీరజ, కల్లూరు మునిసిపాలిటీ చైర్మన్ మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


